
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్‌లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ను ఎన్టీపీసీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. తెలంగాణలోనే మొట్టమొదటగా నిర్మించిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రం.. దేశంలోనే అతి పెద్దదిగా రికార్డు కెక్కింది. కేరళలోని కాయంకుళంలో 80 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంటును అధిగమించింది.
500 ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీపీసీ రిజర్వాయర్ పై రూ. 423 కోట్లతో రెండేళ్ల క్రితం ఈ ప్లాంట్ పనులు ప్రారంభించారు. తొలి దశలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి , అక్టోబర్ నాటికి రెండు, మూడు దశల్లో పనులు పూర్తి చేసి 65 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టిన యాజమాన్యం తాజాగా నాలుగో, చివరి దశను పూర్తి చేయడంతో నిర్దేశిత 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యం అందుకుంది.