
- వారానికి మూడుసార్లు తినాలంటున్న నిపుణులు
- గుండె ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే నిర్ధారణ
- న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
- వివిధ దేశాలకు చెందిన 25 వేల మందిపై రీసెర్చ్

వారానికి మూడుసార్లు చేపలు తినడం ద్వారా కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చని పరిశోధకులు చెప్పారు. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ తదితర పోషకాలతో పాటు విటమిన్ డిని కూడా చేపల ద్వారా మన శరీరం గ్రహిస్తుందని వివరించారు. ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్, ట్రౌట్, టూనా, స్వోర్డ్ఫిష్, మాకరెల్, సార్డైన్స్, హెర్రింగ్ వంటి చేపల ద్వారా ఈ ప్రయోజనాలు పొందొచ్చని తెలిపారు.
చేపలలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎన్-3 పీయూఎఫ్ఏ) మన గుండెతో పాటు కిడ్నీలకూ మేలు చేస్తోందని తాజా పరిశోధనల ద్వారా తేలిందని సైంటిస్టులు చెప్పారు. ఈ ఆమ్లాల వల్ల కిడ్నీల పనితీరులో క్షీణత నెమ్మదిస్తుందని వివరించారు. అయితే, మొక్కల నుంచి సేకరించిన ఎన్-3 పీయూఎఫ్ఏతో ఈ తరహా ప్రయోజనం కనిపించలేదని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.