జగన్ నిర్ణయంతో కేసీఆర్‌ మీద ఒత్తిడి…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఒత్తిడి పెరిగింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయాయి. అయితే, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలను తగ్గించి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మే నెలకు మాత్రం పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ట్రెజరీ, ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్టు సాఫ్ట్ వేర్‌లో మార్పులు చేసుకోవాలని ఆదేశించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీలో ఉద్యోగులకు మే నెల వేతనాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడంతో, తెలంగాణలో కూడా ఉద్యోగులు అదే కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు లేఖ రాసింది. తెలంగాణలో కూడా ఈనెల ఒకటి నుంచి కొద్దొగొప్పో పనులు జరుగుతున్నాయని, మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మేలో ఆదాయం పెరిగింది కాబట్టి, ఈనెల అయినా తమకు పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరింది.