ఆ డబ్బులు ఎగ్గొట్టడానికే కేసీఆర్ కొత్త కండిషన్లు… కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్…

నియంతృత వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళంలో పడేశాయని అన్నారు. ఇప్పటి వరకు ఏ పంట వేయాలనే నియంత్రణ లేదన్నారు. తన భూమిలో ఏ పంట వేయాలో రైతుకు తెలుసని జగ్గారెడ్డి అన్నారు. రైతు పంటకు రైతు బంధు కు లింకు పెట్టడం దురదృష్టం అని అభిప్రాయపడ్డారు. ‘ఏ పంట వేసుకోవలో కూడా రైతుకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతుబంధుతోనే రైతులు బతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. రైతుబంధు ను తప్పించడానికే షరతులు పెడుతున్నారు. రైతులు బానిసలుగా బతకాలా? కూరగాయల రైతుకు రైతు బంధు వర్తిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి.’ అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇక మీదట ప్రజలు ఏం తినాలో కూడా సీఎం నిర్ణయించేలా ఉన్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ చెప్పిన యువతినే పెళ్లి చేసుకోవాలి అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏం పంట వేయాలో, ఏం తినాలో నిర్ణయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజలు గాలి పీల్చుకోవాలన్న సీఎం అనుమతి తీసుకోవాలా? అని జగ్గారెడ్డి నిలదీశారు.