అరచేతిని నరుక్కుని.. చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగి..

ఓ వ్యక్తి తన అరచేతిని నరుక్కున్నాడు. అంతటితో ఆగకుండా ఆ చేతిని పట్టుకుని ఊరంతా కలియదిరిగాడు. గమనించిన కొంతమంది గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గంజాం జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లా దిగపోహండి ఠాణా పరిధిలోని బి.తురుబుడి పంచాయతీలోని నరేంద్రపూర్ గ్రామానికి చెందిన పి.సమేశ్వరరెడ్డి(20) అనే యువకుడు శుక్రవారం రాత్రి గ్రామంలో హల్ చల్ చేశాడు. తన ఇంటి వెనుక పదునైన ఆయుధంతో తన అరచేతిని నరుక్కున్నాడు. తెగిన అరచేతిని పాలీథిన్ కవర్‌లో పెట్టుకుని గ్రామంలో కలియదిరిగాడు. గమనించిన కొందరు గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని పాలీథిన్ కవర్‌లోని అరచేతితో సహా దిగపొహండి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు సదరు యువకుడిని మెరుగైన చికిత్స కోసం ఎమ్కేసీజి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ప్రస్తుతం వైద్యుడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు పాల్పడిన యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.