ఇంట్లో పనిచేస్తున్న బాలికను గర్భవతి చేసిన 70 ఏళ్ల వృద్ధుడు..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు తన మనుమరాలి వయస్సున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య తన కుటుంబంతో కలిసి జిన్నారం మండలం కిష్టాయిపల్లికి 12 సంవత్సరాల క్రితం వలస వచ్చాడు. రుద్రయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. 14 సంవత్సరాల వయస్సు ఉన్న రుద్రయ్య కూతురు అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల బషెట్టిగారి దయానంద్ ఇంట్లో పనిచేస్తోంది. అయితే దయానంద్ తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాలిక తనపై ఆరు నెలలుగా జరుగుతున్న ఘోరాన్ని కుటుంబ సభ్యులకు చెప్పందేకు భయపడింది. అయితే వారం రోజుల క్రితం బాలికకు తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పి వస్తుండడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

వైద్యులు పరీక్షించి బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయమై బాలిక తండ్రి రుద్రయ్య బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.