టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

సినీ ఇండస్ట్రీ కష్టాలు త్వరలోనే తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో షూటింగ్స్ సహా సినిమా ధియేటర్లు తెరవడంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించగా… తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ విషయంలో టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. షూటింగ్‌ల కోసం త్వరలోనే అనుమతి లభిస్తుందని… దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని ఆయన నిర్మాతలకు హామీ ఇచ్చారు. సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని… ఇందుకోసం సరికొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు.

జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్‌లు , స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫిరెన్స్‌తో పాల్గొన్న సినీ పెద్దల్లో.. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ , జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్ తదితరులు ఉన్నారు.