వాణిశ్రీ ఇంట్లో విషాదం.. గుండెపోటు కాదు.. ఆత్మహత్య..

ఒకప్పటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేష్ (36) మృతి చెందాడు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందలేదని ఆత్మహత్య చేసుకున్నాడని తాజా సమాచారం. అభినయ్ తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తన ఫాంహౌస్‌లో ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలుస్తోంది. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో పాటు పలు సమస్యల కారణంగా కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నాడని.. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే అభినయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అభినయ్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఓ భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అభినయ్ భార్య కూడా వైద్యురాలిగానే పనిచేస్తోంది. అభినయ్ గతంలో రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. కుమారుడు మృతి చెందడంతో  వాణిశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఇక మరోవైపు అభినయ్‌ మరణంపై తిరుక్కలి కుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుమారుడి హఠాన్మరణంతో వాణిశ్రీకి టాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.