సీఎం జగన్‌పై మాజీమంత్రి తీవ్ర వ్యాఖ్యలు…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేశాయనే పదం చాలా చిన్నదని ఆయన అన్నారు. కోర్టు ముక్కు పగిలేలా దెబ్బ కొట్టిందని వ్యాఖ్యానించారు. కోర్టు ముక్కు పగిలేలా.. పళ్లు రాలేలా కొట్టినా ముఖ్యమంత్రికి సిగ్గు లేదని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో ఇంత దారుణం జరుగుతున్నా సిగ్గు శరం లేకుండా సీఎం జగన్ పదవిలో ఉన్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలను తప్పు పడితే సర్వనాశనం అవుతారని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు అదే గతి పడుతుందన్నారు.

జగన్‌కు సిగ్గు… శరం ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ఏ నాయకుడు వ్యాఖ్యలు చేయకూడదన్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి కూడా జుడిషియల్‌పై వ్యాఖ్యలు చేయరని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు.