వైసీపీ విజయ వార్షికోత్సవం… ఆ కార్యక్రమాలకు బ్రేక్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావించిన ఆ పార్టీ నేతలు… తాజాగా ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ విజయ వార్షికోత్సవం సందర్భంగా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయొద్దని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని ఆయన అన్నారు.

జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించవద్దని సీఎం జగన్ ఆదేశించారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గమనించాలని సజ్జల కోరారు.పండ్లు పంపిణీ, తదితర సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్‌డౌన్ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, వార్డు వాలంటీర్ల ద్వారా బాధితులకు సాయం అందించాలని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.