ఏపీలో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దండుగుడు…

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకుని వెళ్లాడు ఓ దుండగుడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 02 జెడ్ 0552 నంబరు గల బస్సును కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు. అతడు ఖాళీ బస్సుతో ధర్మవరం నుంచి NS గేటు, చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరు వెళ్లడానికి ప్లాన్ చేశాడు. అయితే, బస్సు కనిపించకపోవడంతో విషయాన్ని ఆర్టీసీ అధికారులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. కియా కంపెనీ వద్ద బస్సును తీసుకెళ్తున్న నిందితుడిని పోలీసులు ఆపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అసలు అతడు బస్సు ఎందుకు ఎత్తుకుని వెళ్లాలనుకున్నాడన్న విషయం తెలియాల్సి ఉంది.

56 రోజుల లాక్ డౌన్ తర్వాత రెండు రోజుల నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ముగ్గురు కూర్చోవాల్సిన చోట ఇద్దరు, ఇద్దరు కూర్చునే చోట ఒక్కరిని మాత్రమే అనుమతిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతోంది. బస్సులో టికెట్లు తీసుకునే చాన్స్ లేకుండా బస్టాండ్లలోనే టికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, బస్సులను శానిటైజేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది.