నేడు బెంగాల్, ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అంఫన్ తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ కోల్ కతా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని మోదీ బెంగాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. అంఫన్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని స్వయంగా చూడాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. ‘నా జీవితంలో ఇలాంటి భయంకరమైన తుఫాన్‌ను చూడలేదు. ప్రధాని స్వయంగా వచ్చి నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించాలి.’ అని మమతా బెనర్జీ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ స్పందిస్తూ నష్టపోయిన ఏ ఒక్కరినీ కూడా వదిలిపెట్టబోమని, అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన తుఫాన్ బాధితులకు భరోసా ఇస్తూ వరుస ట్వీట్లు చేశారు.

PMO India

@PMOIndia

Tomorrow, PM @narendramodi will travel to West Bengal and Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan. He will conduct aerial surveys and take part in review meetings, where aspects of relief and rehabilitation will be discussed.

అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారంతా చెట్లు, కరెంటు స్తంభాలు కూలి పడడం వల్ల చనిపోయారు. 283 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంత భారీ తుఫాన్ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను అతలాకుతలం చేసింది. కోల్ కతా విమానాశ్రయం కూడా నీట మునిగింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అల్లకల్లోలం సృష్టించడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. ఒడిశాలో అంఫన్ తుఫాన్ కారణంగా 44.8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.