తొలకరి ఆలస్యం.. జూన్ 5న కేరళను తాకనున్న రుతుపవనాలు..

ఈ ఏడాది తొలకరి తొందరగా పలకరిస్తుందని ఆశపడ్డా, ఉమ్‌పున్ తుఫాను ప్రభావం వల్ల ఆలస్యం కానున్నట్లు భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. వాస్తవానికి మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్‌ దీవులను చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో జూన్ 1నే కేరళకు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేసింది. అయితే, తుఫాను ఎఫెక్ట్‌తో రుతుపవనాలు ఆలస్యం కానున్నాయని, జూన్ 5న కేరళను తాకుతాయని తాజాగా పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్ నికోబార్‌ దీవులను మే 20వ తేదీ వరకు చేరుకుంటాయి. ఆ తరువాత కేరళ చేరుకునేందుకు వాటికి 10, 11 రోజులు పడుతుంది.

ఇదిలా ఉండగా, ఉమ్‌పున్ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌లో 72 మంది మరణించారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు.