భార్యకు హోంగార్డుతో సంబంధముందని అనుమానం.. కరోనా మందని విషమిచ్చి..

ఓ వ్యక్తి తన భార్యకు హోంగార్డుతో సంబంధముందని భావించి.. ఆ హోంగార్డు కుటుంబాన్ని అంతమొందించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా పక్కా ప్రణాళికతో కరోనా మందు పేరుతో ఆ కుటుంబానికి విషమిచ్చాడు. అది తాగిన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు ఆ వ్యక్తి కటకటలాపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని అలీపూర్‌కు చెందిన ప్రదీప్(42) తన భార్యకు ఓ హోంగార్డుతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దాంతో ఏలాగైనా హోంగార్డు కుటుంబాన్ని అంతమొందించాలని భావించి ఆ పని చేసేందుకు ఇద్దరు మహిళలతో డబ్బులు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం సదరు ఇద్దరు మహిళలను హోంగార్డు ఇంటికెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌ నివారణకు మందు ఇస్తున్నట్టు నమ్మించాడు.

ఆ మహిళలు విషం కలిపిన ఓ బాటిల్‌ను కరోనా మందు అని చెప్పి హోంగార్డు కుటుంబానికి ఇచ్చారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఆ బాటిల్‌లోని ద్రావకం తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళలను గుర్తించి అసలు విషయం రాబట్టారు. దీంతో ప్రదీప్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.