మనసున్న మనోజ్.. వలస కార్మికుల కోసం బస్సుల ఏర్పాటు

సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ మరోమారు తనలోని మంచి మనసును చాటాడు. వలస కార్మికుల కష్టాలు చూసి కరిగిపోయిన ఆయన వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు బస్సులు నడపాలని నిర్ణయించుకున్నారు. ఓ మంచి పని కోసం అందరి సాయం అవసరమని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. అందరూ తలో చేయి వస్తే వలస కార్మికులను ఇళ్లకు పంపొచ్చని పేర్కొన్నారు.

వలస కార్మికులను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని, అనుమతి కావాలని కేంద్రాన్ని కోరగా, అనుమతించిందని మనోజ్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంకు రెండు బస్సులు బయలుదేరినట్టు మనోజ్ పేర్కొన్నారు. కార్మికులకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్ముందు ఈ సేవలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.
కాగా, మనోజ్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు.