కరోనా ముమ్మాటికీ చైనీస్ వైరస్సే…చైనాపై ట్రంప్ మండిపాటు…

కరోనా వైరస్‌పై చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచం ప్రాణనష్టాలను చెల్లించుకుంటోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండి పడ్డారు. కరోనా మహమ్మారి ప్రజలను హరించేందుకు చైనాయే కారణమని ట్రంప్‌ నేరుగా తప్పుపట్టారు. కరోనా వైరస్‌పై ముందే సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో​ ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లోని 2 లక్షల మందికి సోకగా 10000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.చైనా పాలకులు కరోనా వైరస్‌పై ప్రాథమిక వివరాలను బయటకు పొక్కకుండా నొక్కివేసారని, దీంతో ఈ మహమ్మారిని నిరోధించే అవకాశం చైనా, అంతర్జాతీయ వైద్య నిపుణులకు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కరోనా కట్టడి విషయంలో చైనా తీరును ట్రంప్‌ తప్పుపట్టారు. కాగా గత ఏడాది డిసెంబర్‌ 31న సోషల్‌ మీడియాలో వైరస్‌ గురించి తొలిసారిగా రాసి, కోవిడ్‌-19తో మరణించిన డాక్టర్‌ లీ వెలింగ్‌ను స్ధానిక పోలీసులు వైరస్‌పై నోరుమెదపవద్దని హెచ్చరించారనే వార్తలు వెలుగులోకి రావడం గమనార్హం.