కరోనా అనుమానంతో రాళ్లతో కొట్టి చంపారు…

కరోనా ఉందన్న అనుమానంతో, అది అందరికీ అంటిస్తాడేమోనన్న భయంతో ఓ యువకుడిని స్థానికులు కొట్టి చంపారు. బార్‌కు వెళ్లి వస్తున్న యువకుడి మీద మూకుమ్మడిగా దాడి చేశారు. రాళ్లు తీసుకుని కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కెన్యాలోని నైరోబీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ భయానికి అగ్రరాజ్యం, పేదరాజ్యం అనే తేడా లేకుండా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో నైరోబిలోని క్యాలే ప్రాంతంలో జార్జ్ కొటిని హెజ్రోన్ అనే వ్యక్తి బార్‌కు వెళ్లి వస్తుండగా, కొందమంది అతడిని అడ్డగించారు. ఆ మూకలోని యువకులు అతడికి కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యకతం చేశారు. తమకు కూడా వైరస్ అంటిస్తాడేమోనన్న భయంతో రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హెజ్రోన్‌ను ఆ తర్వాత కొందరు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. బాధితుడికి అసలు కరోనా ఉందో, లేదో కూడా తెలియదని వైద్యులు చెప్పారు. మద్యం తాగిన అతడు తూలుతూ వస్తుంటే, అతడికి కరోనా వచ్చి ఉంటుందన్న అనుమానంతో కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.