ANDHRA PRADESH

వైసీపీ నేతలకు సర్వే టెన్షన్… తేల్చేసిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన వైసీపీ నేతలు, మంత్రులను టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం… ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని నేతలు భావించారు. అయితే కేబినెట్‌లోనే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు… వైసీపీ నేతలకు ఒకరకంగా షాక్ ఇచ్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో.. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీయే సుప్రీం అని తెగేసి చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరో ఇప్పటికే తేలిపోయిందని.. అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో ప్రజాబలం కలిగిన నేతలెవరో సర్వే ద్వారా నిర్ధారించామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు దగ్గరగా ఉండే నేతలు, అనుకూలంగా ఉండే వారికి పార్టీ తరపున టికెట్ ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు ప్రయత్నిస్తుంటారు. ఎక్కువశాతం పోటీ చేసే అవకాశాలు కూడా వారికే వస్తుంటాయి.

కానీ… స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ అభ్యర్థులను పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుందని… దీనిపై సర్వే చేయించామని సీఎం జగన్ చెప్పడంతో… తమ అనుకున్న వాళ్లకు టికెట్ వస్తుందో లేదో అని పలువురు నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. కొందరైతే… అసలు పార్టీ అధినాయకత్వం నిర్వహించిన సర్వేలో ఎవరికి మొగ్గు ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సర్వే ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు వైసీపీ నేతలను కొంత టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

Back to top button
Close