NATIONAL
Trending

సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన కేజ్రీ… ప్రమాణ స్వీకారం ఆరోజు కాదు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. అయితే ఆయన ఈ విషయంలో ఇంతవరకు పాటించిన సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశారు. అందరూ ఊహించినట్లుగా ఆయన ప్రేమికుల దినోత్సవం రోజే ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నారు. కానీ కేజ్రీ మాత్రం ఆరోజు కాకుండా మరో రోజు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 16న అంటే ఆదివారం… ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2013 లో తొలిసారిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. బిజెపి 31, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు గెలుచుకోగా…  కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఆప్ కాంగ్రెస్ తో చేతులు కలిపి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 28 న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఏర్పడిన కేవలం 49 రోజుల్లోనే కూలిపోయింది. దీని తరువాత కేజ్రీవాల్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక విషయం ఏమిటంటే, కేజ్రీవాల్ 14 ఫిబ్రవరి 2014 న ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత 2015 లో ఎన్నికలు ప్రకటించారు. మరోసారి కేజ్రీవాల్ తన సత్తా చాటారు. మొత్తం 67సీట్లు సాధించారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. దీంతో ఆప్ ప్రతినిధి రాఘవ్ చాధా ఫిబ్రవరి 14 న రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. ఏరోజైతే పదవికి రాజీనామా చేశారో.. మళ్లీ అదే రోజు కేజ్రీవాల్ ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 2015 న రెండవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే 2018 లో, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా… కేజ్రీవాల్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేసారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం కూడా ఫిబ్రవరి 14 న అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఈ రోజును చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫిలితాలు కూడా ఫిబ్రవరి 11న రావడంతో… ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ… కేజ్రీ మాత్రం ఫిబ్రవరి 16న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఈరోజు ఉదయం గవర్నర్‌తో కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు.

Tags

Related Articles

Back to top button
Close