Breaking NewsNATIONAL

షాహీన్‌బాగ్‌ కాల్పుల నిందితుడు ఆప్‌ సభ్యుడు!

వెల్లడించిన పోలీసులు..ఖండించిన నిందితుడి కుటుంబం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పలువురు మహిళలు చేపడుతున్న నిరసన దీక్ష వేదిక వద్ద కాల్పులకు పాల్పడిన నిందితుడు కపిల్‌ బైసలా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందినవాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. కపిల్‌, అతడి తండ్రి గతేడాది ప్రారంభంలో ఆప్‌లో చేరినట్లు డీసీపీ (క్రైమ్‌ బ్రాంచ్‌) రాజేశ్‌ దేవ్‌ తెలిపారు. కపిల్‌ మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దాని నుంచి వాట్సప్‌ డేటాతోపాటు కపిల్‌, అతడి తండ్రి ఆప్‌లో చేరినప్పటి ఫొటోలను రిట్రీవ్‌ చేసినట్లు చెప్పారు. ఆప్‌ నేతలతో కపిల్‌ దిగిన ఫొటోలను కూడా ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. పోలీసుల ప్రకటన నేపథ్యంలో ఆప్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశ భద్రతతో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆటలాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. నేటితో ఆప్‌ ముసుగు తొలిగిపోయిందన్నారు. ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అయితే పోలీసుల ప్రకటనను కపిల్‌ బైసలా కుటుంబ సభ్యులు ఖండించారు. కపిల్‌ చిన్నాన్న ఫతేశ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కపిల్‌కు గానీ, తమ కుటుంబానికి గానీ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. కపిల్‌ తండ్రి 2008లో బహుజన సమాజ్‌ పార్టీ     (బీఎస్పీ) నుంచి పోటీచేసి ఓడిపోయారని, అప్పటి నుంచి తాము ఏపార్టీలోనూ లేమని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
Close