చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ…

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఊహించని షాక్ ఇచ్చిందా ? అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న పోరాటం ఫలించే అవకాశం లేదని కేంద్రం పరోక్షంగా సంకేతం ఇచ్చిందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీ మూడు రాజధానుల అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రం… రాష్ట్ర రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని వివరించింది. దీంతో ఈ విషయంలో టీడీపీ ఏ రకంగా ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీకి చెందిన ముఖ్యనేతలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వంటివారు ప్రకటనలు చేశారు. అయితే తాజాగా పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వడంతో… ఈ విషయంలో బీజేపీ టీడీపీకి, ఆ పార్టీ అధినేతకు గట్టి షాక్ ఇచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీపరంగా బీజేపీ ఏపీ శాఖ అమరావతికి, ఆ ప్రాంత రైతులకు మద్దతుగా క్షేత్రస్థాయి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నా… కేంద్రం మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం… టీడీపీకి ఎదురుదెబ్బే అనే రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.