Breaking NewsTELANGANA

ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ కీలక భేటీ…

ఈనెల 11న ఉదయం 11 గంటలకు కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఈ కలెక్టర్ల సదస్సు జరగనుంది. నిన్నే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల్ని భారీగా బదిలీ చేశారు. జాయింట్ కలెక్టర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వరకు ఏకంగా 50 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఇంత భారీ స్థాయిలో ప్రక్షాళన జరిగిన తర్వాత చాలా మందిలో సందేహాలు ఉంటాయి. దీంతో అవన్నీ క్లియర్ చేసి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి? ఏయే జిల్లాల్లో ఏమేం టాప్ ప్రయారిటీలు ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేయనున్నారు. దీంతో పాటు కొత్త కలెక్టర్లతో ఓ సారి ముఖాముఖి చర్చించినట్టు కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 11న కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త రెవిన్యూ చట్టం తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పల్లె ప్రగతి, పట్టణప్రగతి అంటూ కార్యక్రమం కూడా చేపట్టారు. దానిపైనా చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదలీ ఇదేం తొలిసారి కాదు. దీంతో పాటు తెలంగాణలోని 31 జిల్లాలకు గాను 20 మంది కొత్త కలెక్టర్లను కూడా నిమయించారు. అయితే చాలామందిని గతంలో నిర్వహించిన శాఖలకే బదిలీ చేశారు. గతంలో వారు ఆయా శాఖలను సమర్థంగా నిర్వహించిన ఫీడ్ బ్యాక్‌తో ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు ఏడాదిన్నరగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 16మంది సబ్ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చారు. వారందరిని ఐటీడీఏ, పీవోలు, మున్సిపల్ కమిషనర్లుగా నియమించారు. తాజా బదిలీల్లో మంత్రి కేటీఆర్ ముద్ర సుస్పష్టంగా ఉందని అధికారర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాబోయే నాలుగేళ్ల పాటు కొనసాగేలా ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్‌ను నియమించింది తెలిసిందే. అనంతరం పాలన వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. జీఏడీ స్పెషల్ సీఎస్ అథర్ సిన్హాను పశు సంవర్థక శాఖకు బదిలీ చేశారు. నిజానికి సీఎస్ సోమేశ్ కుమార్ కంటే ఆయన సీనియర్, సీఎస్ రేసులోనూ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దాంతో ఆయనకు ఇండిపెండెంట్ ఛార్జి ఇవ్వవచ్చని అంతా భావించారు. కానీ జీఏడీ నుంచి ఆయనను అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్థక శాఖకు బదిలీ చేశారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, కీలకమైన అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్ని నియమించిన రజత్ ‌కుమార్‌ను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. విద్యాశాఖ శాఖ కార్యదర్శిగా ఉన్న జనార్థన్ రెడ్డిని వ్యవసాయ శాఖకు బదిలీ చేశారు.ఆయన స్థానంలో స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్‌ను నియమించారు. జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో సుమారు 65 మందికి స్దాన చలనం జరిగింది. 51 మంది ఐఏఎస్ లకు కొత్త పోస్టింగులు ఇచ్చారు.అయితే మరికొంత మందిని వెయిటింగ్ లో ఉంచింది ప్రభుత్వం. టాప్ లెవెల్ నుంచి 2016 క్యాడర్ బ్యాచ్ వరకు బదిలీలు జరిగాయి.

Tags

Related Articles

Back to top button
Close