NATIONAL
Trending

నిర్భయ కేసులో మరో మెలిక

మూడో దోషి క్షమాభిక్ష పిటిషన్

దేశంలో అరనిమిషానికి ఓ రేప్ జరుగుతుంటే… ఎప్పుడో జరిగిన నిర్భయ కేసులో దోషులు నలుగురికీ ఉరిశిక్ష వెయ్యడానికి మన న్యాయ, రాజ్యాంగ వ్యవస్థలు ఆలోచిస్తూ కూర్చుంటున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇవాళ ఉదయమే… ఈ కేసులో దోషిగా ఉన్న వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు. అందువల్ల దోషులు నలుగురికీ ఉరిశిక్ష అమలు చేసేందుకు వీలవుతుంది అనుకునేలోపే… దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్… రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ కేసులోని నలుగురు దోషుల్లో… ఇలా పిటిషన్ పెట్టుకున్న మూడో దోషి ఇతడు. ఇప్పటివరకూ రామ్ నాథ్ కోవింద్… ఇద్దరు దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ పిటిషన్లను కొట్టివేశారు.

ఇప్పుడు ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి ఫైనల్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఉరిశిక్ష అమలు అనేది ముందుకు సాగదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పర్యటనలో ఉంటున్నారు. రెండ్రోజుల తర్వాతే ఢిల్లీ వెళ్తారు. అందువల్ల ఆయన ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్ అయ్యింది.

2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఆమె స్నేహితుణ్ని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ నలుగురు దోషుల ఉరి ఆఖరి క్షణంలో వాయిదా పడింది. ఉరిశిక్ష అమలుపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలన్న దోషుల వాదనను సమర్థిస్తూ… నిరవధికంగా స్టే విధించింది. దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయని కంటతడి పెట్టారు. వారిని ఎలా ఉరితీస్తారో చూస్తానంటూ.. దోషుల లాయర్ సవాల్ విసిరారని ఆమె చెప్పారు.

ఉరిశిక్ష అమలు వాయిదా అంశంపై కోర్టులో దోషుల తరపు లాయర్, తీహార్ జైలు అధికారుల మధ్య వాదనలు జరిగాయి. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే అతడి ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని… మిగతా ముగ్గురిని ఉరితీయవచ్చని జైలు అధికారులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. నలుగురి ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడంతో… నలుగురికీ ఉరిశిక్ష అమలుకు మార్గం ఏర్పడినట్లే. తాజాగా మూడో దోషి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో… పాటియాలా కోర్టు ఎప్పుడు శిక్ష విధిస్తుందో తేలాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
Close